Site icon Prime9

Mp Revanth Reddy : నేను శూద్రుడిని .. స్వచ్చమైన హిందీరాదు.. మంత్రి నిర్మలాసీతారామన్ కు ఎంపీ రేవంత్ రెడ్డి కౌంటర్

Hindi

Hindi

Mp Revanth Reddy : లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య ఆసక్తికర వాదన జరిగింది. కొశ్చన్ అవర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రేవంత్ రెడ్డి హిందీ భాష గురించి కామెంట్ చేశారు. బలహీనమైన హిందీ భాషలో ప్రశ్న వేసిన రేవంత్ రెడ్డికి.. అదే బలహీనమైన భాషలోనే సమాధానం చెబుతా అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి తాను శూద్రుడిని కాబట్టి.. స్వచ్ఛమైన హిందీ తనకు రాదని, కానీ, వారు బ్రాహ్మణవాదులు కాబట్టి.. శుద్ధమైన హిందీ వచ్చు అని వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి తన ప్రశ్నలో నరేంద్ర మోడీని ప్రస్తావించారు. గుజరాత్ సీఎంగా ప్రస్తుత మోడీ ఉన్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని, ఇప్పుడు తాను అదే ప్రశ్న వేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు డాలర్‌కు రూపాయి విలువ 60 నుంచి 70 మధ్యలో ఉందని, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకెళ్లిందని నరేంద్ర మోడీ అడిగారని ఉటంకిస్తూ.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా మార్చురీకే తీసుకెళ్లుతున్నదా? అని ప్రశ్నించారు. రూపాయిని మళ్లీ బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాన్ ఏది అని అడిగారు.

ఇందుకు సమాధానం ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అనుమతి ఇచ్చారు. తాను కూడా అదే తెలంగాణ నుంచి వచ్చానని, కానీ, రేవంత్ రెడ్డి బలహీనమైన హిందీ భాషలో తనకు ప్రశ్న వేశారని ఆమె అన్నారు. కానీ, తన హిందీ కూడా బలహీనమైన భాషే అని తెలిపారు. అయితే ఆ బలహీనమైన హిందీ ప్రశ్నకు తాను బలహీనమైన హిందీ భాషలోనే సమాధానం చెబుతానని వివరించారు.ఆ తర్వాత అప్పటి ఆర్థిక వ్యవస్థ, ఇప్పటి ఆర్థిక వ్యవస్థ కాలాలు, పరిస్థితులు వేరు అని తేడాలు చెప్పారు. కేవలం రూపాయి మారకం విలువనే కాదు.. ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. అప్పటి ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోనే ఉందని, తామే దాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని వివరించారు.

నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలు విభజన వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఆరోపించారు. బ్రిటిష్ వారిలాగే బీజేపీ నేతలు కూడ ప్రజలను ప్రాంతం, మతం, తిండి, భాష ఆధారంగా విభజిస్తున్నారని ఆయన ట్వీట్ చేసారు.

Exit mobile version