Asaduddin owaisi: చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రోహింగ్యా, పాకిస్థానీ, ఆఫ్ఘన్ ఓటర్ల మద్దతుతో అధికార భారత రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), ఏఐఎంఐఎం చీఫ్ ఒవైసీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఒక్కసారి హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ఆ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటున్నారు.. దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండని సవాల్ చేసారు.
ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు మధ్య రహస్య అవగాహన కుదిరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ఒవైసీ మండిపడ్డారు. స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారని, స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ అని ప్రశ్నించారు. నిజంగా స్టీరింగ్ నా చేతిలో ఉంటే తెలంగాణలో దేవాలయాలకు కోట్లాదిరూపాయలు ఎలా మంజూరు అవుతాయని ఒవైసీ అడిగారు.