Nara lokesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. దీనిపై రెండు రోజుల కిందట వైసీపీ అధిష్టానం మీద, మంత్రి పెద్దిరెడ్డి మీద తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు.
జిల్లాలో రెడ్లు ఆధిపత్యం చలాయిస్తున్నారని దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దళితుల సీట్లు మార్చిన వైసీపీ నాయకత్వం పెద్దిరెడ్డి, రోజా, కరుణాకరరెడ్డి తదితరుల సీట్లను మార్చగలదా అంటూ ప్రశ్నించారు. మంత్రి పెద్ది రెడ్డి అనుచరులే తనకు ప్రతికూలంగా రిపోర్టులు అగ్రనేతలకు పంపించారని అన్నారు. పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిధున్ రెడ్డి దళితులను అణగదొక్కుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ రకంగా తీవ్ర విమర్శలు చేసిన ఆదిమూలం తరువాత అజ్జాతంలోకి వెళ్లిపోయారు. ఇపుడు తాజాగా తన కుమారుడితో కలిసి హైదరాబాద్ లో లోకేష్ ను కలిసారు. ఆదిమూలం ఫిబ్రవరి 4వ తేదీన టీడీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది.