Site icon Prime9

Nagababu: సహజ వనరుల దోపిడీలో వైసీపీ నేతల రికార్డులు .. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

Nagababu

Nagababu

Nagababu: సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.

ప్రభుత్వ పెద్దలకూ వాటాలు ..(Nagababu)

జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రి కనుసన్నల్లో నిత్యం కోట్లాది రూపాయిల విలువైన క్వార్ట్జ్ రాయి రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోందని, అధికారగణం అంతా ఈ విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తోందని నాగబాబు ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాల సందర్భంగా స్థానిక జనసేన నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అధికార బలంతో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా వందలాది ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను కనీసం గనుల శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, పోలీసు శాఖలు వైసీపీ నేతలకు అడ్డుకోకపోవడం దురదృష్టకరమన్నారు. క్వార్ట్జ్ రాయి లోపల ఉండే సిలికా పదార్థానికి చైనా, తైవాన్ వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ మైనింగ్ పై గత కొన్ని నెలలుగా వైసీపీ నేతల కన్ను పడింది. నెల్లూరు జిల్లా సైదాపురం, కలువాయి, పొదలకూరు, గూడూరు, రాపూరు మండలాల్లో ఈ దోపిడీ విపరీతంగా ఉంది. మైనింగ్ కోసం భూములు ఇవ్వమని తెగేసి చెప్పేవారిపై పోలీసు కేసులుపెట్టడం, దాడులకు తెగబడడంతో ఆయా ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ వాటాలు చేరడం వల్లే యంత్రాంగం చూసీ చూడనట్టు వదిలేస్తున్నట్టు అర్థం అవుతోంది. హైకోర్టు స్టే ఇచ్చినా దోపిడీ నిరంతరాయంగా సాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత మూడు నెలల్లో సుమారు రూ. 4 వేల కోట్ల విలువ చేసే ఖనిజం సరిహద్దులు దాటించేశారని నాగబాబు పేర్కొన్నారు.

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ఆయన స్పష్టం చేసారు. అక్రమ మైనింగ్ పై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోకుంటే జనసేన – టీడీపీ కలసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని నాగబాబు హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar