Nagababu Comments: ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన పోటీ చేసిన అభ్యర్థులతో అయన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎదురైన సవాళ్లు, ఏ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఎలా నడిచిందనే అంశాలు అభ్యర్ధులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్ధులంతా వారి అనుభవాలను పంచుకున్నారు.నాగబాబు మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యూహం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం, భారతీయ జనతా పార్టీ పెద్దల మద్దతు ఫలించాయన్నారు .
పవనే మన వెన్నుముక..(Nagababu Comments)
మనందరికీ వెన్ను ముక పవన్ కళ్యాణ్ అని నాగబాబు కొనియాడారు . 17 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరు, ఆయన కష్టం, శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుని ముందుకు వెళ్లారోప్రత్యక్షంగా చూశామని పేర్కొన్నారు . పవన్ కళ్యాణ్ కష్టం వృథా కారాదన్న ఉద్దేశంతో అంతా ఐకమత్యంగా పని చేశారు. పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే రాష్ట్రం మళ్ళీ భూ బకాసురుల దోపిడీకి బలైపోయే పరిస్థితి వచ్చేద”న్నారు నాగబాబు .ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతోపాటుగా గ్రామీణ ప్రాంత ప్రజలు జనసేనకి అండగా నిలిచారు అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మనం పోటీ చేసిన ప్రాంతాల్లో జనసేనకు, ఇతర నియోజకవర్గాల్లో కూటమికి బలంగా నిలబడ్డారు. పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం కూడా కూటమికి కలిసొచ్చే అంశమని అన్నారు. రాష్ట్రం కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతగా తపనపడ్డారో , ఎంత త్యాగం చేశారో ప్రజలు గ్రహించారు అని చెప్పారు. జూన్ 4న మంచి ఫలితాలు అందుకుంటామని తెలిపారు.