YS Sharmila: డ్యూటీలో ఉన్న పోలీసుల ఆఫీసర్స్ పై చేయి చేసుకున్నందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో సహా మరో ఇద్దరిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న కారణంగా ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1 గా వైఎస్ షర్మిల, ఎ2గా ఆమె కారు డ్రైవర్ బాలు , ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌లుగా చేర్చారు. డ్రైవర్ బాలును అరెస్టు చేయగా.. మరో డ్రైవర్ జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసుల నేపథ్యంలో వైఎస్ షర్మిలను కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెడికల్ టెస్టుల అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు. మరోవైపు, నాంపల్లి కోర్టు వద్దకు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకోవైపు షర్మిలకు జడ్జి రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణుల అంచనా.
కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో విషయంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేయడం లేదని.. ఈ క్రమంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించాలని వైఎస్సార్ టీపీ భావించింది. ముట్టడి అనంతరం ‘టీ సేవ్’ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం లోటస్ పాండ్ లోని ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన పనుల మీద బయటకు వెళ్తుంటే ఎందుకు అడ్డకుంటున్నారంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. బయటకు వెళ్తుండగా అడ్డుకున్న బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌తో పాటు మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
షర్మిల చేయి చేసుకున్న ఇద్దరు పోలీసులు.. బంజారాహిల్స్ పీఎస్‌లో పని చేస్తుండటంతో అక్కడ కేసు నమోదు చేశారు. మరోవైపు షర్మిల అరెస్టు విషయం తెలుసుకున్న ఆమె తల్లి విజయమ్మ.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె కూడా అక్కడున్న పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెకు నచ్చజెప్పిన పోలీసు అధికారులు అక్కడి నుంచి పంపించి వేశారు. మరో వైపు షర్మిల భర్త అనిల్,లీగల్ టీమ్ తో కలిసి షర్మిల్ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు.