Hyderabad: గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, దాని ప్రభావంతోనే రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే చాలా వరకు రోడ్లు బురదమయం కాగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని రిజర్వాయర్లలలో నీటిమట్టం పెరిగింది.
ఈ రుతుపవనాల వేగం కారణంగా ఈ నెలలో రాష్ట్రంలో పూర్తి స్థాయి వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వారు పేర్కొన్నారు.