TSPSC Exam Schedule: వాయిదా పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

గత నెలలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.

TSPSC Exam Schedule: తెలంగాణ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా వాయిదా పడిన పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ కమిషన్ కొత్త తేదీలను ప్రకటించింది. ఈ మేరకు 5 నియామక పరీక్షలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష, మే 19 న డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పరీక్ష, జూన్ 28 న అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ , జులై 18, 19 గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్ష, జూలై 20,21 గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో నాన్ గెజిటెడ్ పోస్టుల నిమాయక పరీకలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

 

యూజర్, పాస్ వర్డ్ ఎక్కడిది?(TSPSC Exam Schedule)

గత నెలలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు. 17 మందిని అరెస్ట్‌ చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు సిట్‌ పోలీసులు గుర్తించారు. అతనికి వాట్సప్‌ ద్వారా నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించిన అతను గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదంటూ సిట్‌ అధికారులకు వాట్సప్‌ ద్వారానే ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ డైరీలో రాసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్‌ కస్టడీలోనూ చెప్పారు.

 

 

మరికొంతమంది అనుమానితులు

అయితే సూపరిండెంట్ డైరీని స్వాధీనం చేసుకొని సిట్ అధికారులు పరిశీలించగా.. అందులో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ రాసినట్లు ఆధారాల్లేవని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో మరికొంతమంది ఉన్నట్లు గుర్తించిన సిట్.. అనుమానితుల జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు గ్రూప్‌ 1, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్ష రాసినట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరికీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కాగా జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలం సేకరించారు. గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు గ్రూప్‌-1 పరీక్ష స్థాయి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అనంతరం వారిలో ఎవరికీ లీకేజీతో సంబంధాలు లేవనే అంచనాకు వచ్చారు. డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు సాయిలౌకిక్‌, సుశ్మితలను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.