Telangana Assembly Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఇక మరోవైపు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి. 13 జిల్లాలో సాయంత్రం 4 గంటలకే ప్రచార గడువు ముగియనుంది. అన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచే 144 సెక్షన్ అమల్లోకి రానుంది. ఈ సెక్షన్ అమలు పోలింగ్ ముగిసే వరకు కొనసాగనుంది. అప్పటి వరకు గుంపులుగా తిరగడం, ప్రచారం చేయడం, డబ్బులు పంచడం నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు చెబుతున్నారు.
నవంబర్ 30 ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 119 నియోజకవర్గాల్లో సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, మరో 14వేలు అదనంగా ఏర్పాటు చేశారు. అలానే ఎన్నికల వేళ మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ (మంగళవారం) సాయంత్రం ఐదు గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు షాపులన్నీ క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఒక వేళ నియమాలను అతిక్రమించి విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలతోపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ హెచ్చరిచింది.
ప్రచార పర్వంలో అగ్ర నేతలు..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, గజ్వేల్‌లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి గజ్వేల్ చేరుకుని ఆ సభలో ప్రసంగిస్తారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లో రోడ్ షోలో పాల్గొంటారు.. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలో రోడ్ షో, మధ్యాహ్నం రెండు గంటలకు మల్కాజిగిరి ఆనంద్ భాగ్ చౌరస్తాలలో రోడ్ షో నిర్వహిస్తారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటించానున్నారు. జహీరాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్ లలో రోడ్ షోలో పాల్గొంటారు.
ఇక బీజేపీ తరపున కూడా పలువురు అగ్రనేతలు పలు నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ కల్యామ్ రోడ్ షో. కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ప్రకటించారు.