Site icon Prime9

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy

Revanth Reddy

Hyderabad: తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌తో కలిసి ప్రతి ఒక్కరు కనీసం ఒక్క కిలోమీటరైనా నడవాలని కోరారు. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద యాత్రలో పాల్గొనాలని విన్నవించారు. రేపు సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద నిర్వహించనున్న సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్నే కాదు. ఇంతటి ఆర్థిక పరిపుష్ఠి నగరాన్ని మనకందించిన కాంగ్రెస్ నవ నాయకుడు రాహుల్ గాంధీ మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా గత జ్ఞాపకాలను స్మరిస్తూ రేపటి భవిష్యత్ కోసం ఆయనకు మద్దతుగా నిలుద్దాం. రాహుల్ గాంధీ అడుగుతో అడుగు కలుపుదాం. రాజకీయాలకు అతీతంగా ఆయనతో జత కడదాం. కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడుద్దాం. దేశ ఐక్యత మా ప్రాధాన్యత అని చాటుదాం. దేశం కోసం ఒక్క రోజు ఒక్క గంట గడప దాటి రండి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వస్తారని ఆశిస్తూ, ఈ దేశం కోసం రాహుల్ తో కలిసి కదం తొక్కుతారని విశ్వసిస్తూ, నవంబర్ 1న మధ్యాహ్నం 3గంటలకు చార్మినార్ వద్ద కలుసుకుందాం అంటూ లేఖలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దేశం కోసం అడుగు ముందుకు వేసి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారని చెప్పారు. 22 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. నిత్యావసరాలు, చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రశ్నిస్తే దేశద్రోహం అని భాజపా అంటోంది. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ పాలనకు తేడా లేదు. రైతులు, యువతకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ ఆసేతు హిమాచలాన్ని ఏకం చేస్తూ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్రగా బయలుదేరారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version