Ponnala Laxmaiah : తెలంగాణ రాజకీయాహాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ను.. కేటీఆర్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరాలని కోరుతూ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు కేటీఆర్. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు కేటీఆర్.
రేపు కేసీఆర్ ను కలవనున్న పొన్నాల..
ఈ భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తామని తెలిపారు. ఇక, జనగామలో జరిగే బీఆర్ఎస్ సభ ద్వారా పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని, మొత్తానికి పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కేటీఆర్ వివరించారు.
పొన్నాల సీఎం కేసీఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని వెల్లడించారు. బలహీన వర్గాల నేతలకు సముచిత గుర్తింపు ఇచ్చిన ఘనత కేసీఆర్ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల అని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరిన కొన్ని దశాబ్దాల నుంచి సేవ చేశారని గుర్తుచేశారు.