Hyderabad: తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
పోలీసులకు పట్టుబడ్డ నిందితులకు మూడు నాలుగు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయంటూ వాటిని బయటపెట్టారు. దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ అనుసరిస్తున్న తీరును దుయ్యబట్టారు. మొత్తం ఆధారాలను హైకోర్టుకు సమర్పించామని, తాజాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, సుప్రీం కోర్టులోని జడ్జిలందరికీ; దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల డీజీపీలకు, సీబీఐ, ఈడీ, సీవీసీ; అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా సంస్థలకు, దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు వీడియోలు, ఆడియోలు, హార్డ్ డిస్కులను పంపిస్తున్నామని వెల్లడించారు.
దేశం ప్రమాదంలో పడిన సమయంలో కాపాడేది న్యాయ వ్యవస్థేనని, ఇది అత్యంత హీనమైన నేరమని, రెండు చేతులు జోడించి న్యాయ వ్యవస్థను కోరుతున్నానని, ఈ దుర్మార్గంపై నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని రక్షించండి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని సీఎం కోరారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దురాగతాలు కొనసాగడానికి వీల్లేదని, దీనిని సింగిల్ కేస్‌గా చూడవద్దని న్యాయ వ్యవస్థను కోరారు. ఇదే కొనసాగితే దేశంలో అరాచకత్వం, భరించరాని హింస చెలరేగుతుందని, భారత సమాజ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని, అనారోగ్యకర పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఈ దురాగతాలను, ఘాతుకాలను తెలుసుకోవాలనే పంపిస్తున్నామని వివరించారు. ‘‘ఈ దుర్మార్గాన్ని ముక్తకంఠంతో ఖండించకపోతే, అందరం పోతాం. నేను మంచిగా ఉన్నాను కదా అనుకుంటే ఎవరూ మిగలరన్నారు.
ఒకసారి దేశం దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతుంది అని హెచ్చరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే అప్పట్లో పార్టీలకతీతంగా అందరం కొట్లాడామని, ఇంత భయంకరమైన కుట్ర, దగాను అంతా ఖండించాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించాలని మేధావులు, బుద్ధిజీవులకు పిలుపునిచ్చారు. ఈ రాజకీయ కిరాతకాన్ని అరికట్టాలని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
ఇది కూడా చదవండి: BJP MP CP Joshi: లంచం అడిగిన అధికారిని కొట్టిన బీజేపీ ఎంపీ