Harish Rao: తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 30 న వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ను ఆహ్వానించకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా? వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా? వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అని మేము అడిగామా? ఎన్ని సార్లు, ఎవరు ప్రారంభించాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఇష్టం. రాష్ట్ర గవర్నర్‌గా, మహిళగా తమిళిసై ని గౌరవిస్తాం. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ వ్యవహరించడం బాధగా ఉంది.
రాజకీయం కాకపోతే ఇంకేమిటీ?(Harish Rao)
వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లును 7 నెలలు ఆపడం అవసరమా? సుప్రీంకోర్టుకు వెళితే తప్ప బిల్లులపై కదలిక రాలేదు.. ఇది న్యాయమా? రాష్ట్రంలో అనుభవం ఉన్న ప్రొఫెసర్లు లేరని పదవీ విరమణ వయసును పెంచాం. యూనివర్సిటీల ఉమ్మడి నియామకాలు వేరే రాష్ట్రాలు చేయడం లేదా? విశ్వవిద్యాలయాల బిల్లు 7 నెలలు ఆపి.. మళ్లీ తిప్పి పంపడం ఎంత వరకు సమంజసం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం కాదా? రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడమే కాదా? గతంలో 5 ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోద ముద్రవేసిన గవర్నర్ ఇప్పుడు 7 ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి పంపడం రాజకీయం కాకపోతే ఇంకేమిటీ? ’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
తమిళసై ఏమన్నారంటే.. (Harish Rao)
హైదరాబాద్ గచ్చిబౌలి లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. దేశానికి వచ్చే దేశాల అధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమని, ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు దగ్గర కావచ్చుకానీ రాజ్‌భవన్, ప్రగతిభవన్ మాత్రం దగ్గర కాలేవన్నారు. ‘ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, మంత్రులైనా ఓపెన్ మైండ్‌తో ఉండాలి. తమ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం, దేశం కోసం పనిచేయాలి.
కొందరు ముందుగా ప్రజలకు మంచి చేసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతారు. కానీ కొందరు కేవలం మాటలు చెబుతారే తప్ప ఏమీ చేయరు’ అంటూ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప సొంత కుటుంబాల వృద్ధి కోసం కాకూడదన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే వారు ప్రజల కోసం కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. అహంకారాన్ని పక్కనపెట్టి సామరస్యంగా పరస్పరం చర్చించుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని గవర్నర్ అన్నారు.