Governor Tamilisai Meets Amit Shah: అమిత్‌షాతో గవర్నర్ తమిళిసై భేటీ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశం పై చర్చించారు.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 11:15 AM IST

New Delhi: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశం పై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తమిళిసై అమిత్ షా కు వివరించారు.

దీంతోపాటు లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పర్యవసానంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య తలెత్తిన వివాదాల అంశాన్నీ అమిత్‌షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్, పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలనూ అమిత్‌షా ఆరా తీశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టిందని, ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

అవసరాన్ని బట్టి కేంద్ర బలగాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితుల పై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని గవర్నర్‌కు సూచించారు. అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌తో గవర్నర్‌ భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతికి అభినందనలు తెలిపి, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.