Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్‌లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో క్షణాల్లోని దుకాణంలోని బట్టలన్నీ కాలి బూడిదయ్యిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. చుట్టుప్రక్కల మరికొన్ని షాపింగ్ కాంప్లెక్సులు, లాడ్జీలు ఉన్నాయి. దానితో ఈ మంటలు ఎక్కడ ఆ ప్రాంతమంతా వ్యాపిస్తాయోనన్న భయాందోళనతో అక్కడ నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు.
ఘటనా స్థలికి తలసానీ(Fire Accident In Secunderabad)
ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ ప్రాంతంలో ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. ఫ్లైక్సీల కారణంగా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున అధికారులు ఈ ఫ్లైక్సీలను తొలగించారు. ఇకపోతే నేడు లష్కర్ బోనాలు సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో సికింద్రాబాద్ పరిధిలో తారసపడుతుండడంతో పోలీసులు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.
కాగా, సికింద్రాబాద్ పాలిక బజార్ లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై మంత్రి ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. తరచుగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.