Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనింది. మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిపోయే క్రికెట్ లవర్స్ కోసం ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం వెల్లడించింది.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సమీపంలోని స్టేడియం మెట్రో స్టేషన్ నుండి సెప్టెంబర్ 25న రాత్రి 11 గంటల నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. చివరి రైలు సెప్టెంబర్ 26న అనగా మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి రాత్రి 1 గంట వరకు అమీర్‌పేట్, జేబీఎస్ పరేడ్‌గ్రౌండ్స్ స్టేషన్ల నుంచి కనెక్టింగ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆరోజు మెట్రో రైలు సేవలు ఉపయోగించుకునే క్రికెట్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయని, మిగతా అన్ని ఇతర మెట్రో స్టేషన్లలో దిగిపోయే ప్రయాణికుల కోసం ఎగ్జిట్ గేట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి కానీ ఆయా స్టేషన్ల నుంచి మెట్రో రైలు ఎక్కే అవకాశం ఉండదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
అంతే కాకుండా మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుండి ఎగ్జిట్ అయ్యే వారు ముందుగానే రిటర్న్ టికెట్స్ కూడా తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం సూచిసించింది. లేదంటే ప్రయాణ సౌలభ్యం కోసం, మెట్రో స్మార్ట్ కార్డ్‌లను ఉపయోగించాల్సిందిగా కస్టమర్‌లకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా రాత్రి 10:15 తర్వాత డిజిటల్ టిక్కెట్లు విక్రయించడానికి వీల్లేదనే విషయాన్ని ప్రయాణికులకు గుర్తుచేసింది.
ఇదీ చదవండి: భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత.. రాచకొండ సీపీ మహేష్ భగవత్