Site icon Prime9

komatireddy venkat reddy: తెర వెనుక తమ్ముడికే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అనుమానాలు

Komati-Reddy-Venkat-Reddy

Munugode: మునుగోడులో రాజకీయ వేడి రోజు రోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని అన్న వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంతకీ మునుగోడులో ఏం జరిగిందంటే?

అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. పార్టీలు సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ అన్నకు తమ్ముడి పై ప్రేమ ఉన్నా కూడా పార్టీ కోసం కట్టుబడాలి. అందుకే బీజేపీలోకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మారినా, తాను కాంగ్రెస్ తరుఫునే ప్రచారం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫష్టం చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మాత్రం వెంకటరెడ్డిని డిఫెన్స్ లో పడేస్తున్నాయన్న చర్చ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు చావోరేవో అన్నట్టుగా పోరాడుతున్నాయి. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పోటీచేసినా పార్టీ మారకుండా కాంగ్రెస్ తరుఫున వెంకట్ రెడ్డి నిలబడ్డారు. తనకు తమ్ముడితో సంబంధం లేదన్నారు. ఇదే కోమటిరెడ్డి పై ఇటీవల రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని కొందరు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలు వెంకటరెడ్డి తీరు పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా? లేదంటే తమ్ముడికే జైకొడుతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే గెలిపించాలని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఫోన్స్ చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఇన్ చార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు సంచలన ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌ లో దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే ఫోన్ కాల్స్ చేశారా? అందులో నిజమెంత? అని తేలాల్సి ఉంది. వెంకటరెడ్డిని వివరణ అడిగేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Exit mobile version