CM Kcr : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధరణి వుండాలంటే బీఆర్ఎస్‌నే గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాల కాలం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. అంతకుముందు మహేశ్వరంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ తీరు వంటలు చేసి పెట్టండి మేము వడ్డిస్తామన్న చందంగా వుందని విమర్శించారు.