Site icon Prime9

Telangana: తెలంగాణ సర్కార్ కు కేంద్రం కరెంటు షాక్

Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ పూర్తైన తర్వాతే బకాయిల గురించి ఆలోచిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. అయితే అదేమీ కుదరదని ఏపీ పంపిణీ చేసిన 8890 మిలియన్ యూనిట్లకు గానూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు బకాయిపడ్డ 6,756 కోట్ల రూపాయలను నెల రోజుల్లోగా చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలసి తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిలపై చర్చించారు. నిజానికి ఎప్పటి నుంచో ఈ విషయం అడుగుతున్నా పట్టని కేంద్రం ఇపుడు మాత్రం సడెన్‌గా తెలంగాణా సర్కార్‌కి ఆదేశాలు జారీ చేయడం మాత్రం విచిత్రంగానే ఉంది అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ రాజకీయం ఏమైనా కీలక పాత్ర పోషించిందా అన్న చర్చ కూడా వస్తోంది. 6,756 కోట్ల రూపాయలను అది కూడా నెల రోజుల వ్యవధిలోగా చెల్లించమని కోరడమంటే కేసీఆర్‌కి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేయడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ విధంగా కేసీఆర్ మీద ఒత్తిడి పెట్టడం ద్వారా అక్కడ రాజకీయంగా తాము లబ్ది పొందవచ్చు అన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. అదే టైమ్‌లో ఏపీకి తాము న్యాయం చేస్తున్నామని చెప్పుకునే వీలు ఉంది. మరి జగన్ మీద ఏమైనా ప్రేమ కాదు కదా అంటే అది కూడా అనుకోవచ్చు అనే అంటున్నారు పరిశీలకులు. ఈ మధ్య టీడీపీతో టచ్ లోకి బీజేపీ వారు వెళ్తున్నారు అన్న వార్తలతో జగన్ కలత చెందారు అని ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఈ విధంగా చేయడం ద్వారా బీజేపీ ఏమైనా సంతోషపెట్టాలనుకుంటోందా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీ పొలిటికల్ రూటే సెపరేట్ కాబట్టి ఏమైనా అనుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు కూడా. ఇక్కడ తమ రాజకీయం తాము చేసుకునే విధంగానే ఆ పార్టీ ఎత్తులు ఉంటాయన్నది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు.

అయితే కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం రాసిన లేఖ ఏకపక్షంగా ఉందన్నారు తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. తమకే ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించాల్సుంటే ఉల్టాగా తమనే ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం లేఖలో ఆదేశించటం విచిత్రంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణాకు 12, 941 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సిన మాటేమిటంటు మంత్రి కేంద్రాన్ని నిలదీశారు. తమకు రావాల్సిన బకాయిల విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా కేంద్రం పట్టించుకోవటం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే కేంద్రం ఆదేశాలను తెలంగాణా ప్రభుత్వం ఆచరిస్తుందన్న నమ్మకం కలగటం లేదు.

Exit mobile version