Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్ర.. నేడు కామారెడ్డి జిల్లాలో బహిరంగసభ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు

  • Written By:
  • Updated On - November 7, 2022 / 11:52 AM IST

Kamareddy: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. భారత్‌ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈ సభను తలపెట్టారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభతో తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర పూర్తవుతుంది. అనంతరం మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. 119 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, జోడో యాత్ర ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పెద్ద కొడ్‌పగల్‌ మండలానికి చేరుకుంది.

రాహుల్‌ ఇక్కడే బస చేశారు. సోమవారం జుక్కల్‌ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఫతాలపూర్‌ గేటు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. మేనూరు వరకు 20 కిలో మీటర్ల మేర యాత్ర చేస్తారు. మరోవైపు ఈ నెల 2న సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర ఆదివారంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ముగిసింది. 5 రోజుల పాటు 130 కిలో మీటర్ల మేర నడిచారు. ఇక ఆదివారం అల్లాదుర్గం మండలం రాంపూర్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించి పెద్దశంకరంపేట మండలం కమలాపూర్‌ వరకు నడిచారు. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు వాహనంలో రాహుల్‌ బయల్దేరారు. అక్కడినుంచి బాచేపల్లి, మహదేవునిపల్లి మీదుగా మాసాన్‌పల్లి వరకు పాదయాత్ర సాగింది. తదనంతరం పెద్దకొడ్‌పగల్‌ గ్రామానికి వెళ్లారు.

భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఆశించిన దానికంటే విక్కువ విజయవంతమైందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియనంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలకు.. తమ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఓ దిక్సూచిగా, ఆశాకిరణంలా కనిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ విశాల ప్రయోజనాలు కోరుతూ రాహుల్‌ పాదయాత్ర చేయడం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. రోజూ వివిధ వర్గాల వారు వచ్చి ఆయనను కలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రాహుల్‌లో పరిణతి చెందిన నేతను చూస్తున్నారని, ఒక పరిష్కార మార్గంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌లో ప్రజలు నెల్సన్‌ మండేలాను చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సృష్టిస్తున్న గందరగోళం నుంచి విముక్తి కలిగించేందుకే రాహుల్‌ భారత్‌ జోడో పేరిట పాదయాత్ర చేపట్టారని వివరించారు. ఈ యాత్ర క్విట్‌ ఇండియా ఉద్యమం సరసన నిలుస్తుందన్నారు.

ఇలాంటి యాత్ర తాను పీసీసీ అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని రేవంత్‌ అన్నారు. అలుపెరగని యాత్రలో యువత, వృద్ధులు, మహిళలు రాహుల్‌తో పోటీపడి నడవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీకి అధికారంపై ఉన్న ధ్యాస ప్రజలపై లేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అవినీతిమయంగా మారిందని విమర్శించారు. మోదీ, అమిత్‌ షా కులాలు, మతాలు, భాషల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ పాదయాత్ర చేయకుండా ఈడీ, ఐటీలతో కేంద్రం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఆయన్ను లొంగదీసుకోవాలని మోదీ, అమిత్‌షా ఎన్ని ప్రయత్నాలు చేసినా జోడో యాత్ర ఆగలేదని స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తే ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్‌ వెనక్కుతగ్గలేదని తెలిపారు.