Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం కీలక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విచారణలో భాగంగా కవిత బినామీగా ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు.
అరుణ్ పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ.. (Delhi Liquor Scam)
దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశాడని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులుప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత, శరత్‌రెడ్డి, రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారు. కవిత లబ్ధి కోసమే ఆరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడు. అప్ నేతలు, సౌత్ గ్రూప్ వ్యక్తులకు మధ్య పిళ్లై సయోధ్య కుదిర్చినట్లు ఈడీ తన చార్జీ షీట్ లో పేర్కొంది. ఈ మేరకు ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పిళ్లై అంగీకరించారు. రూ.100 కోట్ల పెట్టుబడితో రూ.292 కోట్లు సంపాదించినట్లు తెలిపారు. మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై కీలక పాత్ర పోషించాడు. ఈ పెట్టుబడిలో 12శాతం లాభం చేకూర్చడంలోనూ క్రీయశీల పాత్ర పోషించినట్లు ఈడీ తన నివేదికలో పేర్కొంది.
తదుపరి అరెస్ట్ ఎవరు?
ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే పిళ్లైను రెండుసార్లు ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా అరుణ్ పిళ్ళైకి చెందిన రూ . 2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లై రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులతో అరుణ్ పిళ్లై కు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్ట్ ఆమెనంటూ ప్రచారం వీపరీతంగా జరుగుతోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.