Amit shah: తెలంగాణలోని చేవెళ్ల లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ తలపెట్టింది . ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు.. కానీ, ప్రధాని సీటు ఖాళీగా లేదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని అమిత్ షా తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా నరేంద్ర మోదీనే దేశ ప్రధాని అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ముందు ముఖ్యమంత్రి సీటు కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజల నుంచి కేసీఆర్ దూరం చేయలేరన్నారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దేశమంతా విస్తరించాలి అనుకుంటున్నారని.. అందులో భాగంగానే ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
అదే విధంగా ‘టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. లీకేజీలపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరు. యువత జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారు. బండి సంజయ్ ఏం తప్పు చేశారు. పేపర్ లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. 24 గంటల్లో సంజయ్‌కు బెయిల్ వచ్చింది. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కానీ, వారికి సాధ్యపడలేదు. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. మిమ్మల్ని గద్దె దించేవరకు మా కార్యకర్తలు ఊరుకోరు. తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది. 9 ఏళ్లుగా టీచర్ల నియామకాలు లేవు. ఈ లీకేజీల ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా? టీఎస్‌పీఎస్సీ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తెలంగాణ కోసం మోదీ ఎన్నో పనులు చేపట్టారు. హైవేల విస్తరణ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారు. హైదాబాద్-బీజా పూర్ హైవే కోసం నిధులు ఇచ్చాం. కానీ, భూ సేకరణను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ సమాధానం చెప్పాలి.
తెలంగాణ లో కారు స్టీరింగ్ మజ్లీస్ చేతుల్లో ఉందని ఆరోపించారు. కానీ, మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌కు భయపడిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహించడం లేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దొంగలను జైల్లో వేస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు నడుస్తోంది ట్రైలర్ మాత్రమే.. 2024 లో ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. కేసీఆర్‌కు మళ్లీ చెబుతున్నా.. మావాళ్లు జైళ్లకు భయపడరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి’అని అమిత్ తెలిపారు.