Sajjala Ramakrishna Reddy: బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.
టీడీపీ ఏజెంట్ గా పురంధేశ్వరి..(Sajjala Ramakrishna Reddy)
ఎన్టీఆర్ నాణెం విడుదలపై నీచరాజకీయాలు చేశారని సజ్జల ఆరోపించారు. ఎన్టీఆర్ నాణెం పేరిట లక్ష్మీపార్వతిని పిలవకుండా ఆయన ఆత్మకు క్షోభపెట్టారని అన్నారు.
చంద్రబాబు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారని అన్నారు. ఈసారి రెండు వెన్నుపోట్లు చంద్రబాబు పొడిచారని హేళన చేసారు. చంద్రబాబుని పవన్, పురంధేశ్వరి కలిసి బీజేపీతో కలిపేందుకు పైరవీలు చేస్తున్నారని పేర్కొన్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌గా మారారని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో పవన్‌కు తెలియదని ఎద్దేవా చేసారు.
ఏపీకి హోదా వద్దు.. ప్యాకేజీ చాలని చంద్రబాబే చెప్పారని అన్నారు. ఒకప్పుడు బీజేపీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్లీ పొగుడుతున్నారని తెలిపారు.ఆనాడు ప్రధాని మోదీ కుటుంబం గురించిచంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ, బీజేపీని కీర్తిస్తున్నారు. నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మాట్లాడారని సజ్జల అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబే సిద్ధంగా లేరని సజ్జల పేర్కొన్నారు.