Site icon Prime9

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు

rain alert to costal Andhra

rain alert to costal Andhra

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్‌ జోన్‌ ఎఫెక్ట్‌ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తెలంగాణలో రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 8 జిల్లాలలో అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్‌, మహబూబాబాద్, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని. అలాగే ములుగు, జగిత్యాల, మెదక్‌, కరీంనగర్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 223 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 19 వేల 71 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలోనే వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల్లో వరద ప్రమాదకరస్థాయికి చేరింది. నిజామాబాద్‌ జిల్లాలో మంజీరా, గోదావరి నదుల ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాలురా, కాండగావ్‌ బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తోంది. కడెం వరద బీభత్సం కల్లోలం సృష్టించింది. ముంపు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. 48 గంటలపాటు 25 గ్రామాలు గజగజ వణికాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు, ముంపు గ్రామాలకు ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టుకు వచ్చిన వరదలతో ప్రాణ నష్టం లేకున్నా, ఆస్తి నష్టం భారీగా జరిగింది.

మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలతో శ్రీరామ్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్లు ఉండగా 36 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను దాటి కాళేశ్వరం ఆలయం దారికి నీరు భారీగా చేరుకుంటోంది. భద్రాచలం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. 63 అడుగులకు వరద ఉధృతి చేరింది. రెండు గంటలకు అడుగు చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. ఈ రాత్రికి 70 అడుగులకు ప్రవాహం పెరగవచ్చని అధికారుల అంచనా వేశారు. భద్రాచలం నుంచి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో పట్టణం నీట మునిగింది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

పోలవరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పోలవరం నుంచి 15.86 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మొత్తం 16 లంక గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. లంక గ్రామాల్లో గంటగంటకు వరద నీరు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర హైఅలర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఎగువ ప్రాంతాల నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రమాదస్థాయిలో తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది.

Exit mobile version