Supreme Court : తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లక్షా 42వేల 601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించింది. విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినా ఆస్తుల విభజనకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. న్యాయంగా ఆస్తుల విభజన జరిగేలా ఆదేశాలివ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకు తెలంగాణ ప్రభుత్వం భంగం కలిగించిందని వ్యాజ్యంలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
విభజన చట్టం ప్రకారం కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని వాదిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొద్దిరోజులకిందట ఏపీ ప్రయోజనాలపై జగన్ పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని ఆరోపించారు. అలా అయితే ఆయన రాజకీయ భవిష్యత్ కు పులిస్టాప్ పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.