Nagababu: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
నేతలతో సమావేశాలు..( Nagababu)
అదేరోజు మధ్యాహ్నం కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, సూళ్ళూరుపేట నియోజకవర్గనాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. 17వ తేదీన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై చేయబోయే పోరాటం, తెలుగుదేశం పార్టీతో పొత్తు, సమన్వయంవంటి అంశాలపై జనసేన పార్టీ శ్రేణులతో చర్చించి దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఈ నెల 13, 14, 15వ తేదీలలో మంగళగిరి పార్టీ కార్యాలయంలోని పలు సమావేశాలలో నాగబాబు పాల్గొంటారు.
ఇలాఉండగా మన బడి, నాడు నేడు పథకాల పనితీరుపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. మన బడి, నాడు నేడు కార్యక్రమాలను సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారని.. అయినా ఇప్పటికీ పాఠశాలల్లో కనీస అవసరాలు లేవని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏడాదిలోనే కార్యక్రమాలు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారని.. ఇప్పటివరకు 27 నెలలు పూర్తయినా కార్యక్రమంలో పురోగతి లేదని నాదెండ్ల మండిపడ్డారు.