Site icon Prime9

KCR : దసరా నుంచి స్పీడ్ పెంచనున్న గులాబీ బాస్

CM KCR

CM KCR

KCR: దసరా రోజు కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్న గులాబీ బాస్ఇక స్పీడ్ పెంచనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్కెచ్ గీసారు. అందుకోసం ఓ టీమ్ ను డిల్లీకి పంపనున్నారు. అందుకు కొత్తగా కొనుగోలు చేసిన విమానాన్ని వినియోగించనున్నారు.

గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించబోయే కొత్త పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో టీఎర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి 283 మంది నేతలకు ఆహ్వానం అందింది. ఉదయం 11గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్ కు కేసిఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత.. జాతీయ పార్టీపై ముగ్గురు నేతలు మొదట మాట్లాడుతారు. మధ్యాహ్నం 1:19 నిమిషాలకు కేసిఆర్ కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. అనంతరం కేసిఆర్ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు సంతకాలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమావేశంలో టీఆర్ఎస్ జాతీయ సమన్వయకర్తలను కూడా ప్రకటించనున్నారు.

పాన్ ఇండియా రాజకీయాలు మొదలు పెడుతున్న గులాబీ బాస్ ఆ స్థాయిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పార్టీ నేతల విరాళాలతో 80 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విమానాన్ని దసరా రోజునే వినియోగించబోతున్నారు. కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే రిజిస్ట్రేషన్ కోసం ఫ్లైట్ లో ఢిల్లీకి పార్టీ ప్రతినిధులను పంపనున్నారు కేసీఆర్. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ బాధ్యతలు వినోద్ కుమార్, అడ్వకేట్ జనరల్ రామ చందర్ రావుకు అప్పగించిన కేసిఆర్ – పార్టీ కొనుగోలు చేసిన ఫ్లైట్‌లోనే హస్తినకు వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది.ఇక దసరా పండుగ కావటంతో కొత్త పార్టీ ప్రకటన తర్వాత ప్రజా ప్రతినిధులను ప్రగతి భవన్‌కు లంచ్‌కు ఆహ్వానించారు కేసిఆర్. మధ్యాహ్న విందు ఏర్పాట్ల భాద్యతలు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అప్పగించారు. అనంతరం ఇక ప్రజా ప్రతినిధులు అంతా తమ తమ నియోజక వర్గాలకు వెళ్లాలని సూచించారు కేసీఆర్. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యకలాపాల కోసం ఓ భవనాన్ని రెంట్‌కు తీసుకున్నారు. పార్టీ విస్తరణ, డిల్లీ బహిరంగ సభ తదితర అంశాలపై హస్తిన పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నారు గులాబీ బాస్. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు కేసీఆర్. మొత్తంమీద… జాతీయ పార్టీ ఏర్పాటు స్పీడ్ పెంచిన గులాబీ దళపతి పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు టీఆర్ ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ వచ్చిన తర్వాత.. దీనిని రద్దు చేస్తారా? అనే ధర్మ సందేహాలు రాజకీయ తెరమీద అరంగేట్రం చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్‌ను కొనసాగిస్తారా లేక జాతీయ పార్టీ పెట్టిన తర్వాత రద్దు చేస్తారా అన్నది ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. గందరగోళానికి గురికాకుం డా ఉండేందుకు ఆయన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌లో విలీనం చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.అదే నిజమైతే కేసీఆర్‌కు అదే గులాబీ జెండా, అదే ఎన్నికల చిహ్నం “కారు” లభిస్తుందా అనే చర్చ కూడా పొలిటికల్ వర్గాల్లోకొనసాగుతోంది. ఎందుకంటే ఇది భారత ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే తనకు అదే గుర్తు జెండా వస్తాయని నిర్ధారించుకున్న తర్వాతనే బీఆర్ఎస్‌లో టీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ పిలుపునిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేలా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం పేరు మార్చేస్తే ప్రజల్లో ఆ సెంటిమెంట్ దెబ్బతినవచ్చు. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని.. మనదైన గుర్తింపు పోతుందని టీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి… టీఆర్ఎస్‌ను ప్రత్యేక పార్టీగానే ఉంచి.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా చేస్తే చాలన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ అధ్యక్ష పదవుల నుంచి వైదొలిగి.. కేటీఆర్‌కుపూర్తి స్థాయి చార్జ్ అప్పగిస్తే సరిపోతుందని.. బీఆర్ఎస్ .. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తుందని.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ రూపంలో బరిలో ఉండేలా ప్లాన్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ అంశంపై పార్టీ ప్రకటన సమయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

Exit mobile version