Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా భూమిలో నీకు హక్కేంటి అనేది ఇక్కడ ప్రధాన సమస్య అని, ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ చెప్పారు. విశాఖలో దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే ఈ చట్టం తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చని, కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చనే దాన్ని ఈ చట్టంలో తీసేశారని పవన్ అన్నారు.సగటు మనిషికి సులువుగా చెప్పేందుకు ఈ చట్టాన్ని మరింత అధ్యయనం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ చట్టం రాజ్యాంగానికి, ప్రజలకు వ్యతిరేకమని అందరికీ అర్దం అయ్యేలా చెప్పేందుకు తనకు కాస్త సమయం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.