Pawan Kalyan: ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ముగ్గురు నేతలు.. పవన్ చాంబర్ కు బయలుదేరారు.
అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినియోగించిన వాహనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ప్రభుత్వం కేటాయించింది.
సెక్రటేరియట్‌కు వెళ్తున్న మార్గంలో దారి పొడవునా పవన్ కళ్యాణ్‌కి ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెలగపూడి వరకు మానవహారంగా ఏర్పడ్డ రైతులు.. పవన్‌కు గ్రాండ్ వెల్‌కం పలికారు. గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళహారతులు పట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ సెక్రటేరియేట్ చేరుకున్నారు.