Amit Shah: బీసీల అభ్యున్నతికి, తెలంగాణ అభివృద్ధికి పాటుపడేది కేవలం బీజేపీ ఒక్కటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరిగిన జనగర్జన సభలో మాట్లాడిన అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పేదలు, దళితుల వ్యతిరేక పార్టీ..(Amit Shah)
తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్న అమిత్ షా బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మొద్దని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. సోనియా గాంధీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తున్నారు.బీజేపీ పేదల పార్టీగా అభివర్ణించిన అమిత్ షా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలని అన్నారు. కుటుంబ పార్టీలను తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పేదలు, దళితుల వ్యతిరేక పార్టీ అని తెలంగాణ ప్రజల సంక్షేమం కేసీఆర్‌కు పట్టదని అమిత్ షా ఆరోపించారు.
దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది? బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ ఏం చేశారు ? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏం అయ్యాయి అంటూ అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మాట ఇస్తే మాట తప్పదన్న అమిత్ షా పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందన్నారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసామని అమిత్ షా పేర్కొన్నారు.