Hyderabad Voters: నగరాల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా విద్యాధికులు వుంటారు .ఉద్యోగాలు ,వ్యాపారాలు ,చేతిపనులు చేసుకునే వారు అధికం .అయితే పోలింగ్ రోజు మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారు .ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తంతు జరుగుతుంది.దీనితో నగర వాసులకన్నా గ్రామీణ ప్రాంత వాసులకే ఎక్కువగా రాజకీయ చైతన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
మారని హైదరాబాద్ ఓటర్..(Hyderabad Voters)
ఇక హైదరాబాద్ వాసులు ఈసారి కూడా ఓటు కు దూరంగా వున్నారు . ఎప్పటిలాగానే అతి తక్కువగా 40 శాతం పోలింగ్ హైదరాబాద్ లోనే నమోదు కావడం విశేషం. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద కాస్త హడావిడిగా కనిపించినప్పటికీ తర్వాత పోలింగ్ కేంద్రాలన్నీ బోసి పోయి కనిపించాయి. కేవలం అలా వెళ్లి ఇలా ఓటు వేసి వచ్చే పరిస్థితి నెలకొంది. కొత్త ఓటర్లు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. గత ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలలోనూ అదే సీన్ రిపీట్ అయింది .ఓటు హక్కు వినియోగం పై ఎన్నికల కమిషన్ ఎంత ప్రచారం చేసినా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయింది . హైదరాబాద్ ఓటరు మారడన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకుందామన్న స్పృహ హైదరాబాద్ వాసులకు కలగక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
సెలవు ప్రకటించినా.. ఎండలు లేకున్నా..
పోలింగ్ రోజు కార్యాలయాలు ఉంటే ఓటు వేసే వెసులు బాటు ఉండదని ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు .మరో వైపు వరసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో అస్సలు హైదరాబాద్ లో లేకుండా వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు కొందరు .కొందరేమో హాయిగా ఇంట్లోనే కూర్చుని సెలవును ఎంజాయ్ చేసారు . బాధ్యతతో ఓటు వేయాలన్న ఆలోచన హైదరాబాద్ వాసుల్లో కొరవడిందని విశ్లేషకులు అంటున్నారు . ఎండ తీవ్రత ఎక్కువగా లేకపోయినా ఓటు వేయడానికి హైదరాబాదీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అనేక నియోజకవర్గాలలో 40 శాతానికి దాటకపోవడంతో ఎన్నికల కమిషన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలింగ్ శాతం పెరగడానికి చేసిన ప్రయత్నాలు ఈసారి కూడా ఫలించలేదని చెబుతున్నారు.
తిరుగు ప్రయాణంో ట్రాఫిక్ జామ్..
ఏపీ ,తెలంగాణ లో ఓట్ల పండగ ముగియడంతో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లిన వాళ్ళు తిరుగు ప్రయాణం ప్రారంభించడంతో విజయవాడ- హైదరాబాద్ హైవే పై ట్రాఫిక్ జాం అయింది. ఏపీలో ఓటింగ్ ముగియడంతో ఓటర్లు తమ వాహనాలలో తెలంగాణకు తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకుని ఏపీ నుంచి తిరిగివస్తున్న ఓటర్ల వాహనాలతో చౌటుప్పల్ ,పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.