Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ఈ వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ కారణంగా ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. హైదరాబాద్‌కు (Heavy Rains) ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదే విధంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో సైతం మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. (Heavy Rains) ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి.