Harish Rao Comments: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలుంటాయని హరీష్ వివరించారు. కెసిఆర్ కిట్‌మీద కెసిఆర్ గుర్తుని కాంగ్రెస్ చెరిపేస్తోందని, కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలని రద్దు చేస్తున్నారని, ఏడాదిలోనే ప్రజలనుంచి తిరుగుబాటు తప్పదని హరీష్ రావు విశ్లేషించారుకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా, పథకాలను రద్దు చేస్తూ కాలయాపన చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా త్వరలో బీఆర్‌ఎస్ ఆందోళనలు ప్రారంభిస్తుందని తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుని కూడా బిఆర్ఎస్ గెలవలేకపోయింది. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో బిఆర్ఎస్ గ్రాఫ్ కూడా దెబ్బతింది. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి చేదు అనుభవం మిగిలింది. దీనితో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తిరిగి పట్టు నిలుపుకోవాలని బిఆర్ఎస్ భావిస్తోంది. సిట్టింగ్ లోక్‌సభ స్థానాన్ని తిరిగి గెలిచేందుకు బిఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. దీనికనుగుణంగా తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షకు హరీష్ రావు, కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ మండలాల కీలక నేతలు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గంనుంచి 70మంది కీలక నేతలని ఈ సమావేశానికి రప్పించారు.