Waiver of Crop Loans In Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 9, 2023లోపు తీసుకున్న రుణాలకు 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. శుక్రవారం తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
2022 మే 6 వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని ఈ మేరకు రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014, 2018లో సుమారుగా 28 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్ తేదీగా నిర్ణయిస్తే తమ ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి మొదలు పెట్టి.. 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్లను కటాఫ్ తేదీగా తీసుకుందన్నారు. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందిని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో సబ్ కమిటీ నియమించామన్నారు. ఈ కమిటీ జూలై 15లోపు నివేదిక ఇస్తుందని దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.