CM Revanth Reddy Comments: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చూద్దామన్నా కూడా కనిపించదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తే ఉండదని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనన్నారు.
ఇలా ఉండగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఏకనాధ్ షిండే అవుతారని చెప్పారు. అదానీ గురించి తప్పుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇపుడు అతని వెంట నడుస్తున్నారు. దావోస్ లో వారి మధ్య ఏం జరిగిందనేది బయటకు చెప్పాలన్నారు. అదానీ, పీఎంల డబుల్ ఇంజన్‌కి రేవంత్‌ను మూడో ఇంజన్‌గా కేటీఆర్ పేర్కొన్నారు.తమ పార్టీకి బీజేపీతో ఎప్పటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నిఃయోజక వర్గం అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏమీ చేయలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి ప్రారంభిస్తే, కిషన్‌రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో లిఫ్టులను ప్రారంభించారని అన్నారు. బీఆర్‌ఎస్ 36 ఫ్లైఓవర్‌లు నిర్మించిందని ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్లను బీజేపీ పూర్తి చేయలేకపోయిందని కేటీఆర్ చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్లియర్ చేసే వరకు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ప్రజలను కోరారు. 10 జనపథ్ చిరునామాకు సోనియాగాంధీకి కరెంటు బిల్లులు పంపిచాలని యన ప్రజలను కోరారు.