Undavalli Arun Kumar:ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు.శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాుతూ ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటారని తాను భావిస్తున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్నింటినీ సాధించుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. పదేళ్లు ఇలాంటి అవకాశం దక్కలేదని, ఇలాంటి అరుదైన అవకాశం మరోసారి వచ్చేందుకు ఛాన్స్ లేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీలో బీజేపీతో కలవకపోయినా టీడీపీ, జనసేన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ముందుగానే ఈ రెండు పార్టీలతో పొత్తు కలుపుకుని మోదీకి మరో అవకాశం దక్కేందుకు కారణమయిందన్నారు. అమరావతి, పోలవరంతో పాటు విభజన సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింప చేసేలా ప్రయత్నించాలని ఆయన కోరారు.
పవన్ అంటే గాలి. ఇది మామూలు గాలి కాదు పెను తుఫాన్ అని అన్నారు . పవన్ కళ్యాణ్ తాపత్రయ పడకపోతే ఈ పొత్తు కుదిరేది కాదన్నారు .ఈ పొత్తు లేకపోతే మోడీకి మాత్రం కచ్చితంగా నష్టం జరిగి ఉండేది అని చెప్పారు .ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ ప్రశాంతంగా ప్రధానమంత్రి అయ్యారన్నారు .అదే విధంగా టీడీపీ ,జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే రాష్ట్రం నష్టపోతుందని అన్నారు . గతంలో టీడీపీ హయంలో గానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గాని ప్రతిపక్ష పాత్ర ఎవరు పూర్తిగా పోషించలేదన్నారు .జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న పనులు కక్షతో చేస్తున్నారని మధ్యతరగతి వాళ్లు నమ్మారు అని చెప్పారు .ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత ఉండవల్లి మొదటి సారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు .