Bandi Sanjay:కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మీరు శత్రువులుగా నటిస్తూ, ఢిల్లీలో కాంగ్రెస్, అలాగే ఎంఐఎంతో మీరెంత స్నేహంగా ఉంటారో ప్రజలకి తెలిసిపోయిందని బండి సంజయ్ చెప్పారు.
కాంగ్రెస్‌కి ఓటేస్తే బిఆర్ఎస్‌కి వేసినట్లే..(Bandi Sanjay)
కాంగ్రెస్‌కి ఓటేస్తే బిఆర్ఎస్‌కి వేసినట్లేనన్నది తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా విస్మరించిందో దేశ ప్రజలకి తెలిసిపోయిందన్నారు. 317 జిఓతో ఇంటర్‌మీడియట్ స్టూడెంట్స్, రైతులు, యువకులు, ఉపాధ్యాయుల జీవితాలని ఎలా బలి తీసుకున్నారో తెలిసిపోయిందని బండి సంజయ్ చెప్పారు. ఉద్యోగులకి జీతాలు చెల్లించలేకపోతున్న విషయం, మరుగుదొడ్లకి కేటాయించిన సొమ్ములని ఎలా కొట్టేశారో, మిషన్ భగీరథ నిధుల వ్యయంలో అవకతవకలు, పీఎం ఆవాస్ యోజన నిధులని ఇవ్వకపోవడంలాంటి విషయాలన్నీ బయటపడ్డాయని బండి సంజయ్ తెలిపారు.
పేదలకోసం మోదీ సర్కార్ ఇచ్చిన ఉచిత బియ్యానికి పైసలు ఎలా వసూలు చేశారో దేశానికి తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. నరేగా నిధుల మళ్ళింపు కూడా బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. సంక్షేమ పధకాల అమలుకి కేంద్రానికి ఎలా సహకరించలేదో కూడా బయట పడిందని బండి సంజయ్ తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై చెప్పిన అబద్ధాలు కూడా బయటపడ్డాయని బండి సంజయ్ చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో కారుని తొక్కేస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.