YS Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్టు ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

YS Viveka Murder Case: మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విననుంది. తన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని సుప్రీం కోర్టుకు అవినాష్ రెడ్డి అభ్యర్థించారు. తన పిటిషన్ ను హైకోర్టు బెంచ్ వినే వరకు తనను అరెస్టు చేయొద్దని సీబీఐను ఆదేశించాలని కోరారు. తల్లి అనారోగ్యం వల్ల వారం రోజుల పాటు సీబీఐ విచారణకు హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంలో విచారణకు రానుంది.

పరామర్శించిన వైఎస్ విజయమ్మ(YS Viveka Murder Case)

విశ్వభారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ వచ్చారు. అవినాష్ ను, వైద్యులను అడిగి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

కాగా, విశ్వభారతి హాస్పిటల్ వద్ద వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పరామర్శకు వచ్చిన విజయమ్మ ను ఫొటోలు తీస్తుండగా దాడికి ప్రయత్నించారు. వారిపై రాళ్లతో దాడికి దిగారు. వైసీపీ శ్రేణులు మీడియా ప్రతినిధులను నోటికి వచ్చినట్టు తిడుతూ వెంబడించారు.