Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమం నిర్వహించారు. సోమవారం ఉదయం 6:55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో పవన్ యాగశాలకు వచ్చి.. దీక్ష చేపట్టారు. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని అనుసరిస్తూ సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ.. పవన్ ఈ యగాన్ని తలపెట్టారు. ఈ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు పవన్.
ఈ క్రమంలోనే యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టించారు. గణపతి, చండీ మాత, శివ పార్వతులు, సూర్య భగవానుడు, శ్రీ మహావిష్ణువు.. ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతామూర్తులకు అభిముఖంగా యంత్రస్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాలను.. మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లులతో అలంకరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు విజయవాడ దుర్గగుడిలో వారాహి యాత్ర విజయవంతంగా జరగాలని కోరుకుంటూ జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. 14 వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుండగా.. సెక్షన్ 30 యాక్ట్ కారణంగా అమలాపురంలోవారాహి యాత్రను నిర్వహిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
యాత్ర తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది. ఈ క్రమం లోనే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన పార్టీ అధిష్టానం తాజాగా విడుదల చేసింది. యాత్ర తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధి లోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల పరిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి ఈ యాత్ర కొనసాగనుంది.
(Pawan Kalyan) వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్..
జూన్ 14 – కత్తిపూడి సభ
జూన్ 16 – పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 18 – కాకినాడలో వారాహి యాత్ర, సభ
జూన్ 20 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
జూన్ 21 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 22 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ
జూన్ 23 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ