Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బుధవారం నాడు భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు అని.. దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతమని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, తాను ఈ విషయాన్ని కేంద్రపర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
అలానే వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్రలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ ఎర్ర మట్టి దిబ్బలను పరిరక్షించాల్సిన అవసరాన్ని చెప్పారు. ఇది జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం దాదాపు 20,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఎర్ర మట్టి దిబ్బలు 262 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఇటువంటి ప్రకృతి వింతలు కనిపిస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ఇంతటి ముఖ్యమైన వారసత్వ కట్టడాన్ని ధ్వంసం చేస్తున్నారని, ఆ స్థలాన్ని పరిరక్షించాల్సిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ధ్వంసానికి సహకరిస్తోందని విమర్శించారు.
ఎర్ర మట్టి దిబ్బలు దోచుకోవడానికి పక్కా ప్రణాళికతో.. సహజ వనరులను దోచుకోవడంపై, ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై అధికార వైఎస్సార్‌సీ నేతలు పెడుతున్న అదే ధ్యాస మరోలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. సహజ వనరుల దోపిడీని ఆపాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోకుంటే జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసి ఎర్రమట్టి దిబ్బలను రక్షించేందుకు ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని జనసేనాని వ్యాఖ్యానించారు.
ఇక పవన్ కళ్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు.. ఈ సందర్భంగా విశాఖ దసపల్లా హోటల్‌లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొనున్నారు.