Pawan Kalyan : ఏపీలో కొన్నిరోజుల క్రితం ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి బందోబస్తు కోసం వచ్చి పాము కాటుతో పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసి చాలా బాధనిపించింది. బందోబస్తు కోసం వచ్చినవారు ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. డ్యూటీలో ఉన్న వారికి వసతులు లేమి ఉన్న విషయం ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయంపై ఒక ఎస్.పి.స్థాయి అధికారి ఆధ్వర్యంలో – మదింపు జరగవలసి ఉంది అని పేర్కొన్నారు.
వారికి తగిన వసతులు ఏర్పాటు చేయవలసి ఉంది. ప్రాణాలు కోల్పోయిన పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. అలానే పవన్ కుమార్ కుటుంబానికి తగినంత నష్టపరిహారం తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు.
పాము కాటుతో కానిస్టేబుల్ మృతి చెందడం బాధాకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/oXdq0dRG6j
— JanaSena Party (@JanaSenaParty) May 26, 2023