Nara Lokesh : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మళ్ళీ ఇప్పుడు అనూహ్యంగా లోకేష్ పేరు కూడా అందులో ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే మార్పులు చేసి టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల వైపు మళ్లించారని ఆరోపిస్తున్నారు. తద్వారా వారి భూముల విలువను పెంచేందుకు కృషి చేశారని.. జగన్ సర్కారు ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు పలువురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.