Site icon Prime9

MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. విడుదల.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన !

mp avinash reddy arrest and got bail in ys viveka murder case

mp avinash reddy arrest and got bail in ys viveka murder case

MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డిని.. వివేకా హత్య కేసులో సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శనివారం (3న) సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయని సమాచారం అందుతుంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి.. తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ అనంతరం తననూ అరెస్ట్‌ చేస్తారన్న ఆలోచనతో విచారణకు పలు కారణాలతో గైర్హాజరవుతూ వచ్చారు. ఇందులో భాగంగానే గత నెల 16 నుంచి విచారణకు హాజరుకాకుండా ఆయన తల్లి కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారంటూ చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలో సీబీఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు అవినాష్‌ (MP Avinash Reddy) అనుచరులు పెద్దఎత్తున మోహరించడంతో సీబీఐ స్థానిక ఎస్పీ సాయం కోరింది. శాంతిభద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఒకవేళ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్‌ చేసి, పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. అయితే అరెస్ట్‌, విడుదల విషయాన్ని అటు సీబీఐ గానీ, ఇటు అవినాష్‌రెడ్డి గానీ వెల్లడించకుండా గోప్యత పాటించడం గమనార్హం. మరోవైపు అవినాష్‌రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.

 

Exit mobile version