Janasena Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. కాగా ఎన్డీయే సమావేశానికి హాజరవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
హస్తినలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావాలని జనసేన నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. ప్రజలు తనని సీఎం చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు. వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరం కలిసి పోరాడాలని చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చినట్టయింది అని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తెదేపాతో పొత్తు వ్యవహారం గురించి భవిష్యత్తు నిర్ణయిస్తుందని వెల్లడించారు.
ఇప్పటి వరకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే విషయాన్ని పవన్ ప్రకటించక పోయినప్పటికి.. వైసీపీ వ్యతిరేక ఓటును మాత్రం చీలనివ్వను అని చెబుతూ వస్తున్నారు. ఇక ఢిల్లీ వేదికగా పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయే పరిస్థితి ఉంది.