Janasena Varahi Tour : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమం లోనే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన పార్టీ అధిష్టానం తాజాగా విడుదల చేసింది. యాత్ర తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధి లోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల పరిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి ఈ యాత్ర కొనసాగనుంది.
జూన్ 14 – కత్తిపూడి సభ
జూన్ 16 – పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 18 – కాకినాడలో వారాహి యాత్ర, సభ
జూన్ 20 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
జూన్ 21 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ
జూన్ 22 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ
జూన్ 23 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ
అయితే అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పేరుతో అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జూన్ 10 అర్ధరాత్రి నుంచి సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటుందని ఆ ప్రకటలో తెలిపారు. కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం, రాజోలు, సఖినేటిపల్లి మల్కిపురం, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ యాక్ట్ వర్తిస్తుందని వెల్లడించారు. కాగా అమలాపురం అల్లర్ల కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అమలులో ఉన్న సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను పరిస్థితులు సర్దుమనగడంతో దశలు వారీగా ఎత్తివేశారు.
మొదటి నుంచి పవన్ వారాహి యాత్రను అడ్డుకునేందుకు అధికార వైకాపా.. అన్నీ విధాలుగా ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. ఈ కోవలోనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నో నాటకీయ పరిణామాలను మనం గమనించవచ్చు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యే లు అంతా వారాహిని ఏపీలో రోడ్లపై తిరగనివ్వమని సవాళ్ళు విసిరినప్పటికి.. పవన్ “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ మొత్తానికి యాత్రకి సిద్దమైన తరుణంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో ఎత్తుగడని ప్రయత్నించినట్లు కనిపిస్తుంది.