Heavy rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 11:41 AM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 722 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

భారీ వర్షానికి శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. సూర్యమహల్‌ వద్ద ముంపు అంచనా వేయలేకపోవడంతో ఓ కారు కల్వర్టులోకి దూసుకెళ్లిపోయింది. పెదపాడు చెరువు పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు మునిగిపోయేంత మేర నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై నీటిని కల్వర్టుల ద్వారా మళ్లించారు. భారీ వర్షాలతో 13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. విశాఖ నగర శివారుల్లో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. భీమునిపట్నంలో అత్యధికంగా 17.9 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. గోపాలపట్నంలో 12.1, విశాఖ రూరల్‌లో 10.8, గాజువాక 8.2, అనకాపల్లి జిల్లా పరవాడలో 6.3, అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 4.6 సెం.మీల చొప్పున వర్షం కురిసింది.

ఇక రుతుపవన ద్రోణి చురుగ్గా ఉండడం భారీ వర్షాలకు దోహదపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లా మాత్రమే లోటులో ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు ఈ జిల్లా వర్షపాతం సాధారణం కంటే 20.9 శాతం లోటులో ఉండేది. కానీ, ప్రస్తుత వర్షాలతో 3.9 శాతం అధిక వర్షపాతానికి చేరుకుంది.