Site icon Prime9

Telugudesam Party : ” ‘తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ నిర్వీర్యం అవుతోంది’ అని చంద్రబాబు ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అన్నారు?

fact-check-on-chandrababu-shocking-commentas-about-telugudesam-party

fact-check-on-chandrababu-shocking-commentas-about-telugudesam-party

Telugudesam Party : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. అయితే అధికారం లోని వైకాపా నేతలు తాజాగా ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ, ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ని రిలీజ్ చేసి తెదేపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆ వీడియో లో తెలుగు దేశం పార్టీ గురించి ఎవ్వరూ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తరుణం లోనే అసలు ఈ వీడియోకి సంబంధించి ఫాక్ట్ చెక్ చేసేందుకు ప్రైమ్ 9 ప్రత్యేక కధనం మీకోసం అందిస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియోని ఒక బలమైన అస్త్రంగా వైకాపా నేతలు ఉపయోగించుకున్నారు. విజయ సాయి రెడ్డి చేసిన ఆ పోస్ట్ లో ” మొన్న అచ్చన్న… నిన్న స్వయంగా చంద్రబాబే ” పార్టీ లేదు – బొక్కాలేదు” అనేశాడే ! రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా…పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు. తమ్ముళ్లూ సర్దుకోండిక! అని ట్వీట్ చేశారు. ఇక విజయ సాయిరెడ్డి పోస్ట్ చేసిన ఆ వీడియో చూస్తే … తెదేపా అధినేత చంద్రబాబు ” రోజురోజుకీ పార్టీ నిర్వీర్యం అవుతుంది. మీరేమో అక్కడ పోరాడకుండా, చెప్పిన పని చేయకుండా వ్యవహరిస్తున్నారంటూ స్వంత పార్టీ నేతలపై మండిపడ్డారు. ఎవరు ఊహించని రీతిగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం పట్ల అంతా షాక్ కి గురవుతున్నారు. బాబు మాటలతో పార్టీ కార్యకర్తల్లో ఒకింత అయోమయం నెలకొంది. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఈ వీడియోని షేర్ చేస్తూ ట్రెండింగ్ గా మారుస్తున్నారు.

ఇప్పటికే గతంలో ఒకసారి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు టిఫిన్‌ తింటూ స్వంత పార్టీ నేతలతో ” పార్టీ లేదు.. బొక్కా లేదు అని చెప్పిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దీంతో ఆ వీడియో గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నాయకులంతా సమన్వయంతో పని చేసుకునేలా వరుస సమీక్షలు నిర్వహిస్తూ… జిల్లా మీటింగ్ లు, నియోజకవర్గ మీటింగ్ లు, ఇంచార్జ్ లతో మీటింగ్ లను చేపడుతున్నారు చంద్రబాబు. బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి , పలు కార్యక్రమాల ద్వారా అధికార పార్టీ వైఫ్యల్యాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు పార్టీని అభివృద్ది చేసేందుకు ఈ వయస్సులో అన్నీ విధాలా కృషి చేస్తున్న చంద్రబాబు ఈ విధంగా మాట్లాడడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

చంద్రబాబు మాట్లాడిన ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే … 

ఆ వీడియో చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు ట్వీట్ లో విజయసాయి రెడ్డి చెప్పినట్లు ఇటీవల మాట్లాడినవి కావు. ఆ వీడియోలో చంద్రబాబు మాట్లాడిన మాటలు అక్టోబర్ 14 వ తేదీన మంగళగిరి లోని తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లోనివి.

ఎందుకు అలా మాట్లాడారు అంటే … 

తూర్పుగోదావరి జిల్లా లోని రాజానగరం నియోజకవర్గ నేతలతో ఆ సమీక్ష ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ పెందుర్తి వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, పార్టీ నేతలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ వీడియో లో అన్నట్లే నిజంగానే చంద్రబాబు రోజురోజుకీ పార్టీ నిర్వీర్యం అవుతుంది అని అన్నారు. కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ పరిస్థితుల గురించి కాకుండా నియోజవర్గం లోని పరిస్థితులను ఉదహరిస్తూ… నేతలను సమాయత్తం చేసేందుకు , పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించేందుకు అన్నట్లు తెలుస్తుంది.

అలానే ‘‘నేను 20 మందిని రమ్మంటే 500-600 మంది వచ్చారు. ఎందుకొచ్చారయ్యా ? ఎందుకు తీసుకొచ్చావయ్యా వెంకటేశ్? ఎందుకు తీసుకొచ్చావ్? గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరంతా. వన్‌సైడ్ ఉండదు. బంగారం లాంటి నియోజకవర్గాన్ని కంపు చేసి, మళ్లా ఇక్కడికి వచ్చి నాకు కర్టెన్స్ వేయాలని చూస్తారా మీరు? ఆ టెక్నిక్స్ అన్నీ వదిలేయాలి. మిమ్మల్ని అందర్నీ వార్న్ చేయడానికే పిలిచా. నాకేమీ పనిలేక పిలవలేదు. మీరేదో ఇక్కడికి వచ్చి గట్టిగా మాట్లాడితే వింటానని అనుకుంటే అది మీ అమాయకత్వం. తమాషాలాడుతున్నారు.

” రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అవుతా  ఉంటే.. మీరక్కడ పోరాడకుండా.. చెప్పిన పని చేయకుండా.. ఇక్కడికి వచ్చి మళ్లా ఏదో బలప్రదర్శన చేస్తాన్నారా మీరు. యాటిట్యూడ్ పోవాలి. మీరు బాగా చేసుకున్నంతసేపు మీరే నాయకులు. మీరు బాగా చేయనప్పుడు బాగా చేసే నాయకుడిని వెతుక్కునే బాధ్యత నాపై ఉంటుంది. మీకోసం పార్టీని త్యాగం చేయను. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎవరికోసం నేను త్యాగం చేయను. పార్టీ నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు ఉండాలి’’ అంటూ చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలను బలహీన పరిచేందుకు ఈ విధంగా వాస్తవాలను వక్రీకరించి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దంటూ తెదేపా నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విజయ సాయి రెడ్డి పోస్ట్ కి వ్యతిరేకంగా రీట్వీట్ లు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version