Site icon Prime9

Erra Gangireddy: సీబీఐ ఎదుట లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి.. జూన్ 2 వరకు రిమాండ్

Erra Gangireddy

Erra Gangireddy

Erra Gangireddy: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగి రెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. జూన్ 2 వ తేదీ వరకు ఎర్ర గంగిరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించనున్నారు. వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్ల విచారణ ఆటంకం కలుగుతోందని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

గంగిరెడ్డి బయట ఉండటం వల్ల విచారణకు సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని సీబీఐ ఆరోపించింది. కాబట్టి బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతో ఆయన బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 5 లోపు సీబీఐకి లొంగిపోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ఎదుట లొంగిపోయారు. కాగా, ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు 72 సార్లు విచారించారు.

 

డీఫాల్ట్ బెయిల్ తో..(Erra Gangireddy)

వివేకానందరెడ్డి హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019, మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజుల గడిచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంలో గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ లభించింది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని, ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరగా.. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

 

దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయొచ్చని సుప్రీం పేర్కొంది. తర్వాత మళ్లీ ఈ కేసు ఏపీ హైకోర్టుకే వచ్చింది. కానీ, తదనంతర పరిణామాలతో వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ అవ్వడంతో… సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే గంగిరెడ్డిని బెయిల్ ను రద్దు చేస్తూ.. సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

 

Exit mobile version