BJP: ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 08:04 PM IST

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు

ఏపీలో ఒక వైపు అధికార పార్టీగా వైసీపీ ఉంటుంది. మరో వైపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ ఉంటుంది. ఇక బీజేపీ జనసేనతో కలసి కూటమి కట్టి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం తన శక్తియుక్తులను ఏపీ మీద పెట్టి పనిచేస్తుందనడంలో సందేహం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీలైతే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్కువసార్లు ఏపీకి వచ్చి కూటమి తరఫున ప్రచారం చేసి పెట్టే అవకాశం ఉంది. అపుడు ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమన్న అంచనాలున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ప్రకటించి ముందుకు సాగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడు ఒక బలమైన సామాజికవర్గమైన కాపుల ఓట్లు పోలరైజ్ అవుతాయి. అలాగే ఇతర వర్గాలలోనూ కొత్త ఓట్లు, కానీ కొత్త వర్గాలు కానీ ఎంతో కొంత మొగ్గు చూపినా ఈ కూటమి 40కిపైగా సీట్లను సాధిస్తుందని అంచనా వేసుకుంటున్నారు.

అదే జరిగితే కచ్చితంగా మ్యాజిక్ ఫిగర్‌కి సరిపడా 88 సీట్లు ఏ పార్టీకి రావు. అపుడు హంగ్ ఏర్పడుతుంది. ఒక్కసారి కనుక ఏపీలో హంగ్ ఏర్పడితే కర్నాటక తరహాలో కొత్త రాజకీయ నాటకం మొదలవుతుంది. అపుడు ఎక్కువ సీట్లు వచ్చిన వైసీపీ, టీడీపీ ఉన్నా కూడా అన్ని రకాలుగా ఆ పార్టీల మీద రాజకీయ ఒత్తిడిలు పెరిగిపోయే అవకాశం ఉంది. చివరికి జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఫస్ట్ టైం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆస్కారం దక్కుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో వేసిన రాజకీయ ఎత్తుగడలలో భాగమే పవన్ కల్యాణ్‌ను బీజేపీ తన వైపున ఉంచుకోవడం అని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కి ఉన్న ఛరిష్మాకు తోడు బీజేపీ రాజకీయ వ్యూహాలు, అనుభవాలను మిక్స్ చేస్తే కనుక ఏపీలో అధికారం బంగారం పళ్లెంలో వచ్చి వాలుతుంది అని లెక్కలేస్తున్నారట కమలనాథులు. బీజేపీ పెద్దలు ప్లాన్‌ చేశారంటే, గురితప్పదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక మరో వైపు చూస్తే ఎన్నికల అనంతరం పొత్తులు కూడా ఉంటాయన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. టీడీపీకి అపుడు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా పవన్ కల్యాణ్‌కే సీఎం సీటు ఇవ్వాలని బేరం పెట్టి.. వీలైతే చంద్రబాబు నాయుడును జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళి కేంద్ర మంత్రిని చేయడం ద్వారా ఈ పొత్తులకు కొత్త డెఫినిషన్ ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అంటే ఎన్నికల ముందు మాత్రం టీడీపీతో ఫైటింగ్ ఉన్నా అనంతరం పొత్తులకు, బేరాలు ఆడేలా ఓటింగ్ సీటింగ్ తెచ్చుకోవాలన్నదే బీజేపీ ఎత్తుగడ అని తెలుస్తోంది. అందుకోసమే పవన్ ఒక్క చాన్స్ అంటున్నారు. ఆ రకమైన రోడ్ మ్యాప్ రెడీ కావడం వల్లనే జనసేనలోనూ ధీమా పెరిగింది అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.

ఒక విధంగా బీజేపీ మార్క్ స్ట్రాటజీ వల్ల ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలకూ రాజకీయంగా ఇబ్బందే అని అంటున్నారు. ఎలాగైనా ఏపీలో అధికారం సాధించాలని భావిస్తున్న బీజేపీ తమ కూటమికి 40 సీట్లు దక్కినా చాలు ఏపీలో ముచ్చెమటలు పట్టించేలా రాజకీయం నడుపుతుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత అనుభవాలను, ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుంటే అది అసాధ్యం ఏమీ కాదన్న టాక్‌ ఉంది. సో అలెర్ట్ కావాల్సింది చంద్రబాబు మాత్రమే కాదు జగన్ కూడా అన్నదే కేంద్ర పెద్దల దిశా నిర్దేశంలోని అసలైన సందేశం అని అంటున్నారు. మరి రాజకీయంగా ఏపీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.