Andhra Pradesh: ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు. రాష్ట్ర విభజన కంటే ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ జగన్ వల్లే ఎక్కువ నష్టమని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంటినిండా నిద్రపోవట్లేదని, వ్యవస్థలు నాశనమయ్యాక ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఏపీకి మంచి పేరు తేవాలని, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని చంద్రబాబు అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తుందని ప్రకటించారు. అవగాహన లేనివాళ్లే సంక్షేమం గురించి తమపై విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. రాష్ట్ర విభజన వల్ల ప్రజల్లో భయాందోళనలు ఎన్నో ఉన్నా, ఆర్థికలోటులోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ఇక్కడ సంక్షేమం, ఇతర కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.
అమరావతిని ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాం. పాలకుడికి ఉండాల్సింది విద్వేషం కాదు. విజన్ అని గుర్తించాలి. అమరావతికి వచ్చిన సంస్థలను కొనసాగించినా ఉత్తమ ఫలితాలు వచ్చేవి. జగన్ పాలనలో ఏపీలోని అన్నిరంగాలు, వ్యవస్థలు నాశనమయ్యాయి. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు, నేను అదే ఫాలో అయ్యానని చంద్రబాబు అన్నారు